మహబూబ్ నగర్ జీజీహెచ్‌లో సిబ్బంది మధ్య ఘర్షణ
మహబూబ్ నగర్ జీజీహెచ్‌లో సిబ్బంది మధ్య ఘర్షణ
చందాల వివాదంతో ఒకరిపై ఒకరు దాడి.. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
మహబూబ్ నగర్ ప్రతినిధి (ఆర్కే న్యూస్):
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. అంబేడ్కర్ జయంతి వేడుకల ఖర్చుల విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒకరిపై ఒకరు చేయి చేసుకునే స్థాయికి చేరింది.
అసలేం జరిగిందంటే..:
మంగళవారం జీజీహెచ్‌లో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వైద్యులు, సిబ్బంది నుంచి చందాలు సేకరించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమ ఖర్చులకు సంబంధించిన లెక్కల విషయంలో సిబ్బంది మధ్య విభేదాలు తలెత్తాయి. సీహెచ్‌వై రామునాయక్, కుర్మయ్య మరియు డెంటల్ టెక్నీషియన్ కర్ణల మధ్య ఈ విషయమై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరగడంతో అది ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు భౌతిక దాడికి దిగినట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు:
ఈ ఘటనపై బాధితుడు కర్ణ స్థానిక రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై టూటౌన్ సీఐ ఎజాజొద్దీన్‌ను వివరణ కోరగా.. ఆసుపత్రి సిబ్బంది మధ్య దాడి జరిగినట్లు ఫిర్యాదు అందిందని ధ్రువీకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రాంతంలో సిబ్బంది ఇలా బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది.