పాలమూరు కోసం ‘బీఆర్ఎస్’ పాదయాత్ర

పాలమూరు కోసం ‘బీఆర్ఎస్’ పాదయాత్ర ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ప్రభుత్వం మెడలు వంచుతాం.

పాలమూరు కోసం ‘బీఆర్ఎస్’ పాదయాత్ర

ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ప్రభుత్వం మెడలు వంచుతాం

90 శాతం పనులు పూర్తయినా జాప్యం ఎందుకు?

మాజీ మంత్రుల ధ్వజం.. జూన్‌లో నర్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు యాత్ర

మహబూబ్‌నగర్, మే 15 (ఆర్కే న్యూస్):

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, లేనిపక్షంలో నర్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు భారీ పాదయాత్ర చేపట్టి ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డాక్టర్ సి. లక్ష్మారెడ్డిలు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.

మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి: మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, కేవలం మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వచ్చే స్థితిలో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని విమర్శించారు. జిల్లా మంత్రులకు ప్రాజెక్టుల ప్రాధాన్యతపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. జూన్ నెలలో చేపట్టబోయే పాదయాత్రపై పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

పాలమూరు బిడ్డ సీఎం అయితే జిల్లాకు ఒరిగింది సున్నా: నిరంజన్ రెడ్డి

సొంత జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో పాలమూరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. కానీ ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నారు" అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ పాలమూరు ప్రాజెక్టును విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 40 కిలోల బస్తాకు 4 కిలోల తరుగు తీస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు గోస తగులుతుంది: లక్ష్మారెడ్డి

గత ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును పూర్తి దశకు తీసుకువస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. తాము అధికారంలో ఉండి ఉంటే ఐదు నెలల్లోనే పనులు పూర్తి చేసేవాళ్లమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ , ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, సురభి వాణీ దేవి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.