పదో తరగతి విద్యార్థులకు ఘన సన్మానం
పదో తరగతి విద్యార్థులకు ఘన సన్మానం - సమతాక్షర జ్యోతి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల పంపిణీ.
పాలమూర్, మే 17 (ఆర్కే న్యూస్ ప్రతినిధి):
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని 10 వ డివిజన్, పాతపాలమూర్ ప్రాంతంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఆదివారం నాడు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సమతాక్షర జ్యోతి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులను మెమెంటోలు, శాలువాలతో ప్రముఖులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐ టౌన్ (I Town) సి.ఐ. అప్పయ్య , ప్రముఖ న్యాయవాది బెక్కెం జనార్ధన్ , పాతపాలమూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ మరియు 10 వ డివిజన్ కార్పొరేటర్ T. రమేష్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. విద్యార్థులు సమాజ ఉద్ధారకులైన డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలేల ఆశయాలను, వారి ఆదర్శాలను నిరంతరం దృష్టిలో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. తదుపరి ఉన్నత విద్యను పూర్తి శ్రద్ధతో, ఉన్నతమైన
ఆశయాలతో అభ్యసించాలని, సమాజంలో మంచి వ్యక్తిత్వంతో ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సమతాక్షర జ్యోతి సేవా సమితి నిర్వాహకులను వారు ఈ సందర్భంగా ఎంతగానో కొనియాడారు.
తమ పిల్లల ప్రతిభను గుర్తించి, ఇలాంటి ఉత్తమమైన కార్యక్రమంతో వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సమితి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సన్మాన వేడుకలో సమతాక్షర జ్యోతి సేవా సమితి అధ్యక్షులు బి. హరిదాస్, ఉపాధ్యక్షులు K. అశోక్, ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు, సహాయ కార్యదర్శి ఆంజనేయులు పాల్గొనగా, సమితి ప్రముఖ సభ్యులు సంజీవ రాజు, పి. యాదయ్య, పి. ఆంజనేయులు, జగదీశ్, బాలకృష్ణ, నర్సిములు, అలాగే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.